ప్రతి ఐదేళ్ళకీ జరగాల్సిన పంచాయితీ ఎన్నికలకు గ్రహణం ఎందుకు పట్టింది?

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయితీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. దీనికి ముందు అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికీ, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కి, కోర్టులకీ మధ్య నెలల తరబడి దోబూచులాట సాగింది. పత్రికలకీ, టీవీలకీ కావలసినంత మేత దొరికింది. ఎవరిది ఒప్పు, ఎవరిది తప్పు అన్న వాదోపవాదాలు, చర్చోపచర్చలు సాగాయి. సుప్రీంకోర్టు తీర్పుతో రాజ్యాంగ స్ఫూర్తి నిలబడిందంటూ ముక్తాయింపులు జరిగాయి. మొత్తం ఈ చర్చ అంతా ఎన్నికలు జరపడం, వాయిదా వెయ్యడం అన్న దాని చుట్టూనే తిరిగింది. రాజ్యాంగం ప్రకారం పంచాయితీల పదవీకాలం ఐదేళ్లు. పదవీకాలం ముగిసేలోగా విధిగా ఎన్నికలుజరగాలి. అలా ఎందుకు జరగడంలేదు అన్న అంశాన్ని పూర్తిగా విస్మరించారు. ఇలా అనేకరాష్ట్రాలలో పంచాయితీ ఎన్నికలు వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. ఇందులో అందరి పాత్రా ప్రత్యక్షంగా, పరోక్షంగా వున్నా దానిపై చర్చ మాత్రం జరగడం లేదు.
ఆంధ్రప్రదేశ్‌నే తీసుకుందాం. 73వ రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాత 1995లో తొలి ఎన్నికలు జరిగాయి. తర్వాత 2000 సంవత్సరంలో జరగాల్సిన ఎన్నికలు 2001లో రెండవ ఎన్నికలు, 2006లో మూడోసారి, 2013లో నాలుగో సారి ఎన్నికలు జరిగాయి. 2013 తర్వాత ఇప్పుడు 2021లో అంటే దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రతి 5 ఏళ్లకీ ఎన్నికలు జరిగితే ఇప్పుడు 6వ దఫా ఎన్నికలు జరిగేవి. అంటే మొత్తంమీద 5, 6 సంవత్సరాలపాటు ప్రజాప్రతినిధులు లేకుండానే పంచాయితీలు ప్రత్యేక అధికారుల పాలనలో వున్నాయి. ఇలా పదవీకాలం ముగిసేలోగా ఎన్నికలు జరపకపోవడం రాజ్యాంగ బద్ధమేనా అన్నది మొదటి అంశం. రాజ్యాంగం లోక్‌సభకు, అసెంబ్లీలకు 5ఏళ్ల పదవీకాలాన్ని నిర్దేశించింది. అంతకుమించి అవకాశం లేదని పేర్కొంది. దానికి అనుగుణంగానే ఎలాంటి మినహాయింపులు వాయిదాలు లేకుండా వీటి పదవీకాలం ముగిసేలోగానే ఎన్నికలు విధిగా జరిగిపోతున్నాయి. 73వ రాజ్యాంగ సవరణ పంచాయితీలకు రాజ్యంగ ప్రతిపత్తిని కల్పించింది. లోక్‌సభ, శాసనస సభల పదవీకాలాన్ని నిర్దేశించినట్లు పంచాయితీల పదవీకాలాన్ని కూడా అదే భాషలో ప్రకటించింది. పంచాయితీలకు 5 ఏళ్ల పదవీకాలం ముగిసేలోగానే ఎన్నికలు జరగాలని పేర్కొంది. లోక్‌సభ, అసెంబ్లీలకు ఎమర్జెన్సీ అమలులో వున్నప్పుడు పార్లమెంటు ఆమోదంతో 6 నెలలు వాటి పదవీకాలాన్ని పొడిగించే వీలు రాజ్యాంగం కల్పించింది. పంచాయితీల పదవీకాలాన్ని పొడిగించడానికి రాజ్యాంగం ఎలాంటి వెసులుబాటును ఇవ్వలేదు. అంటే 5 ఏళ్లకు పదవీకాలం ముగిసేలోగా ఎన్నికలు జరిగి తీరాలి. రాజ్యాంగం ఇంత స్పష్టంగా నిర్దేశించినా పంచాయితీ ఎన్నికలు వాయిదా పడుతూనే వున్నాయి. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా పంచాయితీ ఎన్నికల వాయిదాల పర్వం రాజ్యాంగ విరుద్ధంగా ఎందుకు సాగుతున్నది? ఈ అంశాన్ని మనం పరిశీలించాలి.
ఎన్నికలు సజావుగా, సకాలంలో నిర్వహించడానికి దేశానికంతటికీ వర్తించే భారత ఎన్నికల కమిషన్‌ వుంది. ఓటర్ల జాబితాలను స్థిరపర్చడం, సవరించడం, ఇదంతా ఎన్నికల కమిషన్‌ పరిధిలో సాగిపోతుంది. అదే తుది జాబితాను నియోజకవర్గాల వారీగా ఖరారు చేస్తుంది. మరొక ముఖ్యమైన అంశం నియోజకవర్గాల పునర్‌విభజన, రిజర్వేషన్లు ఖరారు చెయ్యడానికి అక్కడ ప్రత్యేక యంత్రాంగం వుంది. దీని కోసం పార్లమెంటు ఒక ప్రత్యేక చట్టం ద్వారా ”డీ లిమిటేషన్‌ కమిటీని” ఏర్పాటు చేస్తుంది. అది ఒక ముసాయిదాను తయారు చేసి అందరి సూచనలు సలహాలు తీసుకుని అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల పరిధిని ప్రకటిస్తుంది. ఈ కమిటీ ఒకసారి నియోజకవర్గాల పునర్‌విభజన, రిజర్వేషన్ల నిర్ణయం తీసుకుంటే అది 20, 25 సంవత్సరాల పాటు ఎలాంటి మార్పులు లేకుండా అమలులో వుంటుంది. దానిని మార్చే హక్కు కోర్టులకీ, ప్రభుత్వాలకీ వుండదు. మనదేశంలో 2002 డీ లిమిటేషన్‌ చట్టం ప్రకారం ఈ ప్రక్రియ పూర్తిచేసి 2026 వరకు అమలులో వుండే విధంగా ప్రకటించింది. అంటే భారత ఎన్నికల కమిషన్‌కు తనదైన ఓటర్ల జాబితా, డీ లిమిటేషన్‌ కమిటీ ఆమోదించిన నియోజకవర్గాలు, రిజర్వేషన్లు అందుబాటులో వుంటాయి. అందువల్ల భారత ఎన్నికల కమిషన్‌కు ఎన్నికలు నిర్వహించడానికి ఎలాంటి అడ్డంకులు వుండవు. వీటిలో ప్రభుత్వాలు జోక్యం చేసుకునే వీలు లేదు. పైగా వీటికి భిన్నంగా కోర్టులు తీర్పు చెప్పడానికి వీలు లేదు. అందువల్ల లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు వాటి పదవీకాలం ముగిసేలోగా విధిగా జరిగిపోతున్నాయి.
పంచాయితీ ఎన్నికలు కూడా రాజ్యాంగం ప్రకారం వాటి పదవీకాలం ముగిసేలోగా విధిగా ఎన్నికలు జరపాలి. కాని అలా క్రమం తప్పకుండా ఎన్నికలు జరపడానికి నిర్దిష్టమైన ఏర్పాటు జరగలేదు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ఎన్నికల కమిషన్లు, కోర్టులు రకరకాల అభ్యంతరాలతో పంచాయితీ ఎన్నికలను రాజ్యాంగ విరుద్ధంగా వాయిదాలు వేసే పరిస్థితి తెస్తున్నారు.
పంచాయితీ ఎన్నికలు నిర్వహించడానికి రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా ప్రత్యేకంగా ఏర్పాటైన రాష్ట్ర ఎన్నికల కమిషన్లు వున్నాయి. అవి శాసనసభలకు భారత ఎన్నికల కమిషన్‌ రూపొందించిన ఓటర్ల జాబితాలనే స్థానిక ఎన్నికలకు కూడా వినియోగించుకుంటున్నాయి. ఇంతవరకూ సజావుగానే కనిపిస్తుంది. కాని ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన ఇతర అంశాలు ఈ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పరిధిలో లేవు. పంచాయితీ వార్డుల పునర్‌విభజన, యం.పి.టి.సి, జడ్‌.పి.టి.సి ప్రాదేశిక నియోజకవర్గాల పునర్‌విభజన అంశాలు రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలో వుంచుకున్నాయి. అందువల్ల అలాంటి పునర్‌విభజన రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిచేసి తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు యిస్తేనే ఎన్నికలు నిర్వహించ గలుగుతుంది. అలాగే వార్డుల, ప్రాదేశిక నియోజకవర్గాల రిజర్వేషన్లు ఖరారు చేసే పని, వాటి రొటేషన్‌ను నిర్ధారించే పని రాష్ట్ర ప్రభుత్వాలు తమ దగ్గర పెట్టు కున్నాయి. అందువల్ల రిజర్వేషన్లను రాష్ట్రప్రభుత్వం ఖరారు చేసి తుది జాబితాను ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన తర్వాతే ఎన్నికలు జరపడం సాధ్యమవుతుంది. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలను పంచాయితీలు, వార్డులు, ఇతర ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా వేరు చేసిన జాబితాను రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించి ఇచ్చిన తర్వాతే పంచాయితీలకు ఎన్నికలు జరపడం వీలవుతుంది.
మరొక అంశం లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో బి.సి రిజర్వేషన్లు లేవు. ఎస్‌.సి., ఎస్‌.టి.ల రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన రాజ్యాంగం ప్రకారం డీ లిమిటేషన్‌ కమిటీ నిర్ణయిస్తుంది. బి.సి.ల రిజర్వేషన్లు అక్కడ లేనందువల్ల ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావడంలేదు. చాలా రాష్ట్రాలలో బి.సి.లకు పంచాయితీరాజ్‌ వ్యవస్థలలో రిజర్వేషన్లు కల్పించారు. దీనికి జనాభా ప్రాతిపదిక కాకపోయినా చాలా రాష్ట్రాలలో బి.సి.లకు నిర్ణయించిన కోటాలు సుప్రీంకోర్టు నిర్దేశించిన 50 శాతం రిజర్వేషన్ల పరిధిని దాటి వున్నాయి. అందువల్ల రిజర్వేషన్ల కోటాను ఆ మేరకు కుదించడానికి రాజకీయంగా రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధం కాకపోవడంతో అక్కడ కోర్టు వివాదాలకు అవకాశం ఏర్పడుతున్నది. దానికి తోడు జనాభా లెక్కలలో బి.సి.ల గణన లేకపోవడంతో అది రిజర్వేషన్లకు ప్రాతిపదిక కాకపోయినా కోర్టు వివాదాలకు దారి తీస్తున్నది. మొత్తంమీద రాజ్యాంగబద్ధంగా పంచాయితీ ఎన్నికలు క్రమం తప్పకుండా జరగడానికి ఇవన్నీ ప్రత్యక్షంగా, పరోక్షంగా అవరోధాలుగా మారి ఎన్నికల వాయిదాకు దారి తీస్తున్నాయి. గత పాతికేళ్లుగా దేశమంతటా పంచాయితీ ఎన్నికలు వాయిదాలు పడుతూ వస్తున్నా దీనిని చక్కదిద్దాల్సిన కేంద్రప్రభుత్వం తనకు పట్టనట్టు వ్యవహరిస్తున్నది. పదవీకాలం ముగిసేలోగా విధిగా పంచాయితీ ఎన్నికలు జరపడానికి అవసరమైన రాజ్యాంగబద్ధ చర్యలను తీసుకోడానికి బదులు, ఎన్నికలు జరపకపోతే నిధుల బదలాయింపు వుండదని ఆ మొత్తాలను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నది. ఈ నేపథ్యంలో పంచాయితీ ఎన్నికలు సకాలంలో జరగడానికి కొన్ని నిర్దిష్టమైన చర్యలను తీసుకోవాలి. 1. పంచాయితీలు, స్థానిక ప్రభుత్వాల ఎన్నికలకు సంబంధించి వార్డులు, ప్రాదేశిక నియోజకవర్గాల పునర్విభజన ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరిగేలాగ, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పరిధిలో ఒక డీ లిమిటేషన్‌ కమిటీ ఏర్పాటు చెయ్యాలి. 2. ఈ పునర్విభజన ఆధారంగా ఓటర్ల జాబితాలను రూపొందించే అధికారం రాష్ట్ర ఎన్నికల కమీషన్‌కు అప్పగించాలి. 3. జనాభా ప్రాతిపదికగా ఎస్‌.టి, ఎస్‌.సి రిజర్వేషన్లను ఖరారు చెయ్యడం, ఇతర రిజర్వేషన్లను సుప్రీంకోర్టు నిర్ణయాల పరిధిలో ఖరారు చేసే అధికారాన్ని ఎన్నికల కమిషన్‌ పరిధిలోకి తేవాలి.
రాష్ట్ర ప్రభుత్వాల పరిధి నుండి వీటిని తొలగించడానికి, ఎన్నికల వాయిదాలపై కోర్టుల ప్రమేయాన్ని నివారించడానికి తగిన విధంగా రాజ్యాంగ సవరణలు చెయ్యాలి.
ఇది దేశప్రజలందరి సమస్య. ప్రజలు నివసించే చోట ప్రజాస్వామ్యాన్ని స్థిరపరిచే సమస్య. రైతుల పేరుతో, కార్మికుల పేరుతో వారి జీవన హక్కులను హరించే అప్రజాస్వామ్య చట్టాలను ఆఘమేఘాల మీద తెచ్చే ఆరాటం, స్థానికంగా ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు అందించడంలో చూపకపోవడమే దాని రాజకీయంగా భావించాలి.
డి.వి.వి.ఎస్‌.వర్మ - 4th February 2021