హిందూత్వ ఎజెండాలో భాగమే జమిలి ఎన్నికలు

తొలిసారి మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2016లో ”ఒకే దేశం- ఒకే ఎన్నిక” నినాదాన్ని తెరపైకి తెచ్చారు. ప్రధానమంత్రే ఈ నినాదాన్ని తవ్వి తలకెత్తుకుంటే పత్రికలు, ప్రసార మాధ్యమాలలో ప్రచారానికి కొదువ వుండదు. ప్రభుత్వపరంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉన్న అనేక సంస్థలు ఈ నినాదాన్ని సమర్థిస్తూ నివేదికల మీద నివేదికలను వెలువరించాయి. 2017లో నీతి అయోగ్‌ జమిలి ఎన్నికలను సమర్థిస్తూ దాని అమలుకు గల అవకాశాలను, మార్గాలను సూచించింది. ఇదే తరహాలో ఎన్నికల కమిషన్‌ ఒకే నివేదికను రూపొందించింది. 2018లో లా కమిషన్‌ మరొకసారి కొన్ని మినహాయింపులతో నివేదికను ఇచ్చింది. మోదీ తన మొదటి 5 ఏళ్ల పాలనలో ఈ నినాదాన్ని పదేపదే ప్రస్తావిస్తూ ప్రజాభిప్రాయాన్ని తనకు అనుకూలంగా మల్చుకునే ప్రయత్నం చేశారు. ఎందు కంటే ఈ నినాదం ఆచరణ రూపం దాల్చాలంటే రాజ్యాంగాన్ని ఒకచోటకాదు ఏకంగా 5 చోట్ల సవరించాల్సి వుంది. పార్లమెంటు ఉభయ సభల కాల పరిమితికి సంబంధించిన 83వ అధికరణాన్ని, రాష్ట్రపతి లోకసభ రద్దుకు సంబంధించిన 85వ అధికరణాన్ని, రాష్ట్రాల శాసనసభల కాలపరిమితికి సంబంధించిన 172వ అధికరణాన్ని, రాష్ట్ర శాసనసభల రద్దుకు సంబంధించిన 174వ అధికరణాన్ని, రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధింపునకు సంబంధించిన 356వ అధికరణాన్ని సవరించాలి. 2014-19మధ్య కాలంలో మోదీప్రభుత్వం ఇలాంటి రాజ్యాంగ సవరణలు చేయగల స్థితిలో లేదు. రాజ్యాంగంలో ఈ తరహా సవరణలు చేయడానికి పార్లమెంటు ఉభయ సభలలోనూ 2/3 వంతుల మెజారిటీతోపాటు దేశంలో మెజారిటీ శాసనసభల ఆమోదంపొందాలి. 2014లో మోదీది సంకీర్ణప్రభుత్వం. పైగా రాజ్యసభలో సాధారణమెజారిటీ కూడాలేదు. అందుచేత మోదీ వ్యూహా త్మకంగా జమిలి ఎన్నికల నినాదం ప్రచారానికి, ప్రజాభిప్రాయాన్ని సమీకరించ డానికి పరిమితం అయ్యారు. రెండోసారి పూర్తి మెజారిటీతో ఎన్నికైన మోదీ రాజ్యసభలో సంఖ్యాబలాన్ని గణనీయంగా పెంచుకున్నారు. ఒకే దేశం – ఒకే ఎన్నికమీద ఇతరపార్టీలను, ప్రత్యేకించి ప్రాంతీయపార్టీల మద్దతు కూడగట్ట డానికి పూనుకున్నారు. 2019 జూన్‌లో జమిలిఎన్నికలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ నినాదానికి 22 పార్టీల మద్దతు లభించింది. వామపక్షాలు, కొన్ని ప్రాంతీయ పార్టీలు మాత్రం వ్యతిరేకించాయి. రాజ్యాంగ దినోత్సవసభ 2020, నవంబరు 26న గుజరాత్‌లో జరిగి నప్పుడు జమిలి ఎన్నికల మీద మోదీ దూకుడు పెంచారు. ”జమిలి ఎన్నికలు కేవలం చర్చించే అంశం మాత్రమే కాదు. అది దేశానికిఅవసరం” అని మోదీచేసిన ప్రసంగం ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టపరిచినట్లయింది. పైగా ఈనినాదం దేశాభివద్ధికీ, ప్రజా శ్రేయస్సుకూ ఉద్దేశించిందని పేర్కొన్నారు. ప్రధాని ఈ ప్రసంగం చేసిన వెనువెంటనే కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ ఒక ప్రకటన చేస్తూ ”తాము జమిలిఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగానే వున్నామ”ని స్పందించారు. ఇక పత్రికలు, ప్రసారమాధ్యమాలు జమిలి ఎన్నికలమీద చర్చోపచర్చలు సాగి స్తున్నాయి. 2022లోనే జమిలి ఎన్నికలు వస్తాయని జోస్యం చెబు తున్నాయి. ఇలా జమిలి ఎన్నికల ప్రయాణానికి మోదీ పూర్వరంగాన్ని సిద్ధం చేసుకున్నారు. ఈ అంశంపై సాగుతున్న చర్చలో, వెలువడిన నివేదికలలో, వ్యాసాలలో, ఈ నినాదాన్ని సమర్థించేవారి వాదనలలో వున్న వాస్తవాలను విశ్లేషించుకోవాలి.
ఎన్నికల నిర్వహణ వ్యయం – వాస్తవాలు
2019 ఎన్నికల ఖర్చు 60 వేల కోట్లు దాటిందని, జమిలి ఎన్నికలతో ఈ వ్యయం గణనీయంగా తగ్గిపోతుందని చేస్తున్న ప్రచారం పూర్తిగా గందరగోళం కలిగించడానికి ఉద్దేశించింది. ఈ ఎన్నికల వ్యయంలో రెండు భాగాలున్నాయి. ఒకటి ప్రభుత్వ ఖజానా నుండి ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్‌ చేసే ఖర్చు. మరొకటి ఎన్నికలలో పోటీ చేసే రాజకీయ పార్టీలు, వారి అభ్యర్థులు పెట్టే ఖర్చు. ఈ 60 వేల కోట్ల అంచనా లెక్క ఈ రెండింటినీ కలిపి చెప్పే లెక్క. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ ఖజానా నుండి చేస్తున్న ఖర్చు మాత్రమే పరిగణన లోకి తీసుకోవాలి. ఎన్నికల్లో పార్టీలు, అభ్యర్థులు పెట్టే ఖర్చు ప్రయివేటు ఖర్చు. ఓట్ల కొనుగోళ్ళకీ, మద్యం పంపిణీకి, సభలకు జనాలను తరలించడానికి, రకరకాల ప్రచారాలకి ఇంకా ఓటర్లను ప్రలోభపెట్టే చీరలు, సారెలు వగైరా ఖర్చులను ఎన్నికల వ్యయంగా, దేశం భరించలేని భారంగా ప్రచారం చెయ్యడం వాస్తవాలను మరుగునపరిచే ప్రయత్నం మాత్రమే.
ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల కమిషన్‌ ఈ కింది ఖర్చులు చేస్తుంది.
1. పోలింగ్‌ స్టేషన్ల ఏర్పాటు, వాటికి అవసరమైన సదుపాయాల కల్పన
2. పోలింగ్‌, కౌంటింగ్‌ సిబ్బందికి ప్రయాణ ఖర్చులు
3. బాలట్‌ బాక్స్‌ల తరలింపు, సిబ్బంది ప్రయాణ ఖర్చులు
4. పోలింగ్‌, ఓటింగ్‌ కేంద్రాలకు అవసరమైన తాత్కాలిక ఫోను, ఎలక్ట్రికల్‌ ఫిట్టింగ్స్‌
5. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి కొనుగోళ్లు.
6. ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి చేసే ఇతర ఖర్చులు.
1952లో తొలి జమిలి ఎన్నికలకు అయిన ఖర్చు 10 కోట్లు మాత్రమే. ప్రతి ఎన్నికకు పెరుగుతున్న ఓటర్లు, ధరవరలు, ఏర్పాట్లకీ అనుగుణంగా ఈ ఖర్చు పెరుగుతూ వచ్చింది. 1977లో 6వ లోకసభ ఎన్నికల నిర్వహణకు రూ.82 కోట్లు ఖర్చుకాగా 2009లో 15వ లోకసభ ఎన్నికల నిర్వహణకు 1,114 కోట్లు, 2014లో 16వ లోకసభ ఎన్నికలకు ఖర్చు 3,426 కోట్లకు పెరిగింది. ఎన్నికల కమిషన్‌ రానురాను ఎన్నికల నిర్వహణ సమయాన్ని వివిధ దశల పోలింగ్‌పేరుతో సాగదియ్యడంవల్ల నిర్వహణఖర్చు మరికొంత పెరుగు తున్నది. ఇది 5ఏళ్లకి ఒకసారి జరిగేఖర్చు. అంటే ఒకే ఏడాదికి ప్రభుత్వ ఖజానా నుండి అయ్యే ఖర్చు కేవలం 700 కోట్లు మాత్రమే. 2019-20 కేంద్ర ప్రభుత్వ మొత్తం వార్షిక బడ్జెట్‌ 28లక్షల కోట్లు. అందులో ఎన్నికల నిర్వహణకు చేసే 700కోట్లు ఖర్చు సముద్రంలో నీటిబొట్టంతమాత్రమే. ఇకరాష్ట్రాలలో ప్రత్యేకంగా ఎన్నికలు నిర్వహిస్తే 5 ఏళ్లకు ఆ రాష్ట్రంలో ఖర్చు 3 లేదా 4 వందల కోట్లు. అంటే ఏడాదికి 100 కోట్లు కూడా లేదు. అందువల్ల జమిలి ఎన్నికలు జరిగితే ఇబ్బడిముబ్బడిగా ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గిపోతుందన్న వాదన వాస్తవం కాదు. అసలు సమస్య ఎన్నికలను కుబేరుల ఆటగా మార్చిన ఎన్నికల వ్యవస్థను సంస్కరించడాన్ని వదిలేసి జమిలి ఎన్నికలే పరిష్కారంగా చూపడం అర్థరహితం.
ఎన్నికల కోడ్‌ – అభివద్ధి
తరచు ఎన్నికల వల్ల ఎన్నికల కోడ్‌ అమలులో ఉంచడంతో అభివద్ధి కార్యక్రమాలు నిలిచిపోతున్నాయన్నది మరో వాదన. లోకసభ ఎన్నికలు జరిగి నప్పుడు దేశమంతటికీ ఎన్నికల కోడ్‌ వర్తిస్తుంది. అప్పుడు కేంద్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వమే వుంటుంది. అది కొత్త పధకాలను, నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉండదు. వివిధ రాష్ట్రాలలో ఎన్నికలు జరిగేటప్పుడు ఆ రాష్ట్రాలలో ఇదే స్థితి వుంటుంది. ఇకపోతే కొన్ని రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం స్తంభించిపోదు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో ఓటర్లను ప్రభావితం చేసే కొత్త పధకాలు, రాయితీలు ప్రకటించడం మీదే ఆంక్షలు ఉంటాయి. రోజువారీ పరిపాలన, అంతకుముందు అమలులో ఉన్న పధకాలు యథావిధిగా కొనసాగు తాయి. గతంలో కొన్ని రాష్ట్రాల ఎన్నికల సమయంలో కేంద్ర బడ్జెట్‌ ప్రవేశ పెట్టడం ఎన్నికలకోడ్‌ వల్ల ఆగిపోలేదు. ఎన్నికల కోడ్‌ వల్ల పాలన స్తంభించడం లేదు. ప్రభుత్వాన్ని నడిపే పెద్దలు ప్రతి ఎన్నికలలోనూ – శాసనసభ లేదా మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలలోనూ తామే అభ్యర్థులమైనట్టు ఆయా పార్టీల మంత్రులు, ముఖ్యమంత్రులు పాలన పక్కనబెట్టి ప్రచారంలో గల్లీగల్లీకి తిరిగే పద్ధతి వల్ల రోజువారీ పాలనకు ఆటంకం కలుగుతుంది. ప్రతి సంవత్సరం ఏదో ఒక ఎన్నిక జరగడంవల్ల కులతత్వం, మతతత్వం ప్రాంతీయ తత్వాలు రెచ్చగొడు తున్నారనీ ఈ చిచ్చు ఆగాలంటే జమిలి ఎన్నికలు అవసరం అంటున్నారు. నిజానికి ఎన్నికల సమయంలోనే కాదు రాజకీయ పార్టీలు అధికారం కోసం ఏ అడ్డదారినైనా తొక్కడానికి సిద్ధపడుతూ ప్రతినిత్యం కులాన్ని, మతాన్ని రాజకీయానికి వాడుకుంటూనే ఉన్నాయి. ఇది కేవలం ఎన్నికలకే పరిమితమైన అంశంగా ప్రకటించడం రోజువారీ కులమత రాజకీయాలను కప్పిపుచ్చడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. మొత్తంమీద జమిలి ఎన్నికలను సమర్థించేవారు చేసే వాదనలలో వాస్తవంతక్కువా, వాగాడంబరంపాలు ఎక్కువగా కనిపిస్తున్నది. మనది చాలా వైవిధ్యం గల దేశం. ప్రాంతీయ ప్రత్యేకతలు, భాషలు, మతాలు గల దేశం. సామాజికంగా ఆహారం ఆహార్యం దగ్గర నుండి ఆచార వ్యవ హారాలు, సంప్రదాయాల వైవిధ్యం గల దేశం. ఈ బహుళత్వాన్ని, వైవిధ్యాన్ని మన రాజ్యాంగ నిర్మాతలు పరిగణనలోకి తీసుకున్నారు. దీనికి తగిన పార్లమెంటరీ తరహా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని ఎంపిక చేశారు. కేంద్రానికీ, రాష్ట్రాలకీ మధ్య స్పష్టమైన విభజన రేఖలు గీశారు. కేంద్ర జాబితా, రాష్ట్రాల జాబితా, ఉమ్మడి జాబితాల రూపంలో అధికారాల విభజన చేశారు. ఎన్నికలలో ప్రజలు తీర్పు చెప్పడానికి ఇవి ప్రాతిపదికలు కావాలి. జాతీయ స్థాయిలో లోకసభకు జరిగే ఎన్నికలలో వివిధ పార్టీలు కేంద్రజాబితాలోని అంశాలపై ప్రకటించే విధానాల ఆధారంగా ప్రజలు తీర్పు చెప్పాల్సి వుంటుంది. అలాగే రాష్ట్ర జాబితాలోని అంశాలఆధారంగా రాష్ట్రాలలోతీర్పులు చెప్పాల్సి వుంటుంది. అందువల్ల లోకసభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు వేరువేరుగా ఎన్నికలు జరపడం వల్ల ప్రజలు దేనికి తగ్గ తీర్పు దానికి చెప్పడానికి వీలు కలుగుతుంది. జమిలి ఎన్నికల వల్ల ఈ అధికార విభజన ప్రాతిపదిక కలగాపులగం అవుతుంది. జాతీయ, రాష్ట్ర అంశాలలో ఏదో ఒక దానికే ప్రాధాన్యత లభిస్తుంది. అలాంటి కలగాపులగపు తీర్పు వాంఛనీయం కాదు.
జమిలి ఎన్నికల అనుభవం
1952 నుండి 1967 వరకు దేశంలో జమిలి ఎన్నికలు జరిగిన మాట వాస్తవం. తిరిగి అదే పద్ధతిని తీసుకురావడం తప్పుకాదని వాదించే వారు ఈ జమిలి ఎన్నికల పర్యవసానాలను విస్మరిస్తున్నారు. మనదేశం 1950లో రిపబ్లిక్‌ అయ్యింది. 1952లో తొలి ఎన్నికలు కావడం వల్ల లోకసభకు, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరపవలసి వచ్చింది. జాతీయోద్యమ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ రెండింటా ఆధిపత్యాన్ని పొందింది. ఇలా ప్రారంభం అయిన జమిలి ఎన్నికలు తర్వాత దశలో ఏకపార్టీ ఆధిపత్యంగా, ప్రజల ప్రాంతీయ ఆకాంక్షలను విస్మరించేదిగా తన నిజరూపాన్ని బహిర్గతం చేసింది. దీని పర్యవసానంగా అనేక రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. ఈ పార్టీలన్నీ కడిగిన ముత్యాలు కాకపోయినా, అనేక బలహీనతలు, లోపాలు, నియంత పోకడలూ ఉన్నా అవి ప్రజల ప్రాంతీయ ఆకాంక్షలకు ప్రతినిధులుగా కొనసాగుతున్నాయి. గతంలో జమిలి ఎన్నికల ప్రయోగం జాతీయ పార్టీ ఏకచ్ఛత్రాధిపత్యానికి దారి తీసింది. వివిధ రాష్ట్రాల ప్రజల ప్రాంతాల ఆకాంక్షల వైవిధ్యాన్ని తుడిచిపెట్టింది. అదొక విఫల ప్రయోగంగా మిగిలింది.
ఒకే దేశం – ఒకే ఎన్నిక పర్యవసానాలు
ఒకే దేశం-ఒకే ఎన్నిక నినాదాన్ని తరిచి చూస్తే చాలా కోణాలు కనిపిస్తాయి. లోకసభకు జరిగే ఎన్నికలు దేశమంతా జరిగే ఎన్నికలు. అవి దేశమంతటా ఒకేసారి జరుగుతున్నాయి. అందువల్ల ఈ నినాదం అసలు లక్ష్యం వేరువేరుగా జరుగుతున్న రాష్ట్రాల ఎన్నికలను రద్దు చేసి లోకసభ ఎన్నికలతో పాటు నిర్వహించడం పైకి కనిపించే సారాంశం. ఇది మనకి కొత్త కాదు. 1952-67 మధ్యకాలంలో జరిగిన జమిలి ఎన్నికలనే తిరిగి మోదీ ప్రభుత్వం పునరుద్ధరించాలని భావిస్తున్నది. ఒక విఫల ప్రయోగంగా చరిత్రలో నిలిచిన జమిలి ఎన్నికలను తిరిగి మోదీ ప్రభుత్వం ఎందుకు తలకెత్తుకున్న దన్నదే అసలు సమస్య. ఎందుకంటే గతంలో జమిలి ఎన్నికలు సాధించిన ఫలితాలు, మోదీ ప్రభుత్వ లక్ష్యాలు ఒక్కటే. ఒక జాతీయ పార్టీ ఏకస్వామ్య పాలన సాధించడం, ప్రాంతీయవైవిధ్యాలను తుడిచిపెట్టడం హిందూత్వ ఎజెండా అమలుచేయడం అని అందరికీ తెలిసిందే. దాని లక్ష్యం ”హిందూరాష్ట్ర” ను అంటే హిందూత్వరాజ్యాన్ని ఏర్పాటు చెయ్యడం. ఇది జరగాలంటే దేశాన్ని ఒక ముద్దగా చెయ్యాలి. అన్ని రకాల వైవిధ్యాలను రూపుమాపాలి. ఈ దిశగా మోదీ ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది. ఒకే దేశం ఒకే చట్టం పేరుతో ఒకే పన్ను చట్టాన్ని (జి.యస్‌.టి) తెచ్చింది. రాష్ట్రాలకు ఉన్న పన్నులు వేసే అధికారాన్ని తొలగించింది. ఒకేదేశం ఒకే మార్కెట్‌ పేరుతో వ్యవసాయ చట్టాలు తెచ్చింది. రాష్ట్ర పరిధిలోని వ్యవసాయాన్ని కబళించింది. కార్మిక చట్టాలను ఏకీకతంచేసింది. ఒకేభాషను అన్నిరాష్ట్రాలమీద రుద్దే ప్రయత్నాలు సాగిస్తున్నది. ప్రజల ఆహార స్వేచ్ఛ మీద, ప్రేమ, పెళ్లి స్వేచ్ఛలమీద దాడులను ప్రోత్స హిస్తున్నది. పౌరసత్వానికి మత ప్రాతిపదికను తెచ్చి మెజారిటీ వాదాన్ని, మత జాతీయ వాదాన్ని ప్రచారంలో పెట్టింది. హిందూత్వ వాదానికి అనుకూలంగా చరిత్రను తిరగరాయిస్తున్నది. ఇలా దేశ ఆర్థిక, సామాజిక జీవనంలో ఏకత్వాన్ని రుద్దే ప్రయత్నాలను ముమ్మరంగా సాగిస్తున్నది. ఇవన్నీ హిందూత్వ ఎజెండాకు భూమికను సిద్ధం చేస్తున్నాయి. ఇక దేశ రాజకీయ రంగాన్ని కూడా ఒక ముద్దగా చెయ్యాలి. ఇది హిందూరాష్ట్ర సాధనకు అత్యంత కీలకం. ప్రస్తుతం జాతీయ రాజకీయ రంగంలో ప్రాంతీయ పార్టీలు, ప్రజల స్థానిక ఆకాంక్షలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. రాజకీయ రంగం నుండి వీటిని తొలగించడం లేదా బలహీనపర్చడం ద్వారానే దేశ రాజకీయం ఒక ముద్దగా మారుతుంది. అప్పుడు దేశ రాజకీయం మెజారిటీ వాదానికి, మత జాతీయ వాదానికి ఆటపట్టు అవుతుంది. హిందూ రాష్ట్ర సాధనకు మార్గం సుగమం అవుతుంది. ఈ హిందూత్వ ఎజండాలో కీలక పాత్ర పోషించేవే జమిలి ఎన్నికలు.
డి.వి.వి.ఎస్‌.వర్మ - 22nd January 2021