మోదీని ఓడించే భావజాల పోరాటం

మోదీ రాజకీయం మామూలు రాజకీయం కాదు. సంప్రదాయ రాజకీయానికి పూర్తిగా భిన్నమైంది. ఈ ప్రత్యేక తరహా రాజకీయాన్ని ఆవిష్కరించడానికి, విశ్లేషించడానికి సంప్రదాయ రాజకీయ కొలబద్దలు పనికిరావు. ఇటాలియన్‌ మార్క్సిస్టు ఆంటోనియో గ్రాంసీ రచనలలోని భావజాలం మనకు ఉపకరిస్తుంది. మోదీ రాజకీయాన్ని ప్రతిఘటించడానికి, ప్రత్యామ్నాయ రాజకీయాన్ని రూపొందించడానికి అది దారి చూపిస్తుంది. ఈ భావజాలం నేపథ్యంలో మోదీ రాజకీయాన్ని అర్థం చేసుకోడానికి మనం కొత్త ఉపకరణాలను రూపొందించుకోవాలి. ప్రతిఘటించడానికి కొత్త మార్గాలను అన్వేషించుకోవాలి.
నిత్యజీవితంలో ప్రజలు కష్టాలను అనుభవిస్తున్నారు అయినా మోదీని ఆమోదిస్తున్నారు. ఇది మన కళ్లముందు కనిపిస్తున్న రాజకీయ వైరుధ్యం, పాలకులు ప్రజల నెత్తిన భారాలు పెడితే వారు దానిని నిరసించాలి, ప్రతిఘటించాలి. పాలకులు ప్రజాదరణ కోల్పోవాలి లేదా పరాజయం పొందాలి. కాని ప్రస్తుత పరిస్థితి దీనికి భిన్నంగా వుంది. పప్పులు నూనెల ధరలు విపరీతంగా పెరిగాయి. పెట్రోలు, డీజిల్‌ ధరలు సెంచరీలు చేస్తున్నాయి. నిరుద్యోగం కొవిడ్‌కి ముందే తారాస్థాయికి చేరింది. తర్వాత ఉపాధి స్థితి అధ్వాన్నం అయింది. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసు మేరకు మద్దతు ధర పెరగకపోగా ఉన్నదీ పోతోంది. కొత్త వ్యవసాయ చట్టాలు, కొత్త కార్మిక చట్టాలు, కొత్త పౌరసత్వ చట్టాలు అన్నీ ప్రజావ్యతిరేకమైనవే. పౌరహక్కుల మీద, ప్రజాస్వామ్య వ్యవస్థల మీద నిత్యం దాడులు జరుగుతున్నాయి. పెద్ద నోట్ల రద్దుతో కుదేలైన ఆర్థిక వ్యవస్థ ఎన్ని ఉద్దీపనలు యిస్తున్నా తిరోగమనంలోనే వుంది. కొవిడ్‌ కాలంలో ప్రజలు పడ్డ, పడుతున్న కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. నిత్యజీవితంలో ప్రజలు ఇన్ని కష్టాలను భరిస్తున్నారు. ఒకనాడు ఉల్లిపాయల ధరలు పెరిగితే ప్రభుత్వాలు పడిపోయిన దేశంలో ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ప్రజలు కష్టాలను భరించడానికి సిద్ధం అవుతున్నారు కాని మోదీని వదిలించుకోవాలని భావించడం లేదు.
2021 జనవరిలో ఇండియాటుడే నిర్వహించిన ”మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌” సర్వేలో మోదీ జనాకర్షణ కించిత్తు కూడా తగ్గలేదని, ఎన్నికలు జరిగితే 302 సీట్లు గెలుస్తారని వెల్లడించింది. ప్రజలు మోదీ పాలనలో కష్టాలను భరించడానికి ఎందుకు సిద్ధం అవుతున్నారు? మోదీ పట్ల మోజును ఎందుకు వదులుకోవడం లేదు? మోదీ రాజకీయంలోని ఈ ప్రత్యేకతను ఎలా అర్థం చేసుకోవాలి అన్న దానిని లోతుగా పరిశీలించాలి.
2014 ఎన్నికలలో మోదీ ఘన విజయం సాధించారు. ప్రజాస్వామ్యంలో జరిగే ఎన్నికలలో అధికార మార్పిడి సహజం. ఈ అధికార మార్పిడి సంప్రదాయ రాజకీయ పరిణామంగానే జరిగిందా? లేక సంక్షోభకాలపు ప్రత్యేకత వల్ల జరిగిందా అన్న అంశాన్ని విశ్లేషించుకోవాలి. 2014 ఎన్నికల నాటికి దేశంలో రాజకీయ సంక్షోభం లేదా నాయకత్వ సంక్షోభం చోటు చేసుకుంది. మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వం అవినీతి కుంభకోణాల పరంపరలో చిక్కుకుంది. అవినీతికి వ్యతిరేకంగా లోక్‌పాల్‌ చట్టం కోసం అన్నా హజారే ప్రారంభించిన ఉద్యమం దిల్లీని కదిలించింది, దేశవ్యాపిత ఉద్యమ రూపం ధరించింది. రాజకీయాలకు దూరంగా వుండే మధ్యతరగతి వర్గాలు ఈ రాజకీయ ఉద్యమంలో పాత్రధారులయ్యారు. సోనియా గాంధీ చేతిలో కీలుబొమ్మ ప్రధానిగా మన్మోహన్‌ను నిర్ణయాలు తీసుకోలేని అసమర్థునిగా భావించారు. అలాగే ముంబై పేలుళ్లపై పాకిస్తాన్‌తో దీటుగా వ్యవహరించలేదన్న విమర్శలు చేశారు. ఎన్నికల నాటికి పాలక పార్టీ ”నాయకత్వ సంక్షోభం”లో పడింది. ఇలాంటి రాజకీయ సంక్షోభాలపై ఆంటోనియో గ్రాంసీ తన రచనలలో చాలా లోతైన విశ్లేషణలు చేశారు. పాలక పార్టీ తన అధికారాన్ని కొనసాగించ లేని స్థితి మరో పక్క ప్రతిపక్షాలు దానిని తొలగించలేని స్థితి వున్నప్పుడు రాజకీయ సంక్షోభంలో అనిశ్చితి ఏర్పడుతుంది. అలాంటప్పుడే రాజకీయ రంగంలో సమ్మోహనా శక్తులకు ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ అనిశ్చితిని తొలగించగల హీరోల కోసం, ప్రజల వెదుకులాట ప్రారంభం అవుతుంది. ఇది స్థూలంగా గ్రాంసీ విశ్లేషణ సారాంశం. 2014 నాటికి కాంగ్రెస్‌ పార్టీ అధికారానికి నూకలు చెల్లాయి. కాని దాని స్థానాన్ని ఏ ఒక్క పార్టీ ఆక్రమించగల స్థితిలేదు. అలాగే ప్రాంతీయ పార్టీలు, వామపక్షాలు అధికారం చేపట్టగల స్థితి కనిపించలేదు. గ్రాంసీ పేర్కొన్నట్లు ఇలాంటి అనిశ్చితి కాలంలో ప్రజలు హీరోల కోసం వెదుకులాడడం సహజం.
అయితే దీనిని మోదీగాని బీజేపీగాని ముందుగానే పసిగట్టిన దాఖలాలు లేవు. మోదీ తన ఎన్నికల ప్రచారంలో హిందూత్వాన్నీ, రామాలయాన్ని తెర వెనుకనే వుంచారు. అందరికీ మంచిరోజులు, అందరికీ అభివద్ధి, యువతకు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు, విదేశాలలో ఉన్న అవినీతి సొత్తు తెచ్చి తలా 15 లక్షల పంపిణీ వంటి సాధారణ వాగ్దానాలనే ఎన్నికల ప్రచారంలో ముందుకు తెచ్చారు. గుజరాత్‌లో సాధించిన విజయాలనే దేశమంతా విస్తరింప చేస్తాననే ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. అయితే ఈ నినాదాలు ఆయన విజయానికి ఎంతవరకు దోహదం చేశాయో తెలియదు కాని ప్రజలు, ప్రత్యేకించి యువత ఆయన వాగ్దానాల కోణం నుండి కాకుండా దేశాన్ని రక్షించే, నడిపించే హీరోగా ఓట్ల ప్రభంజనాన్ని సష్టించారు. ఈ ఎన్నికల్లో ఆయన వాడిన నినాదాలకంటే ”నాయకత్వ సంక్షోభం” కాలపు ప్రజల మనోస్థితి ప్రధానపాత్ర వహించింది. ఇది మోదీ నినాదాలు సష్టించిన ప్రభంజనం కాదు. సంక్షోభకాలంలో ప్రజల మనోస్థితి సష్టించిన ప్రభంజనం. అందువల్ల మోదీ బలం ఆయన ప్రచారం చేసిన నినాదాలలో కంటే ప్రజల మనోభావాల స్థితిలో వుందన్న అంశాన్ని మనం గుర్తించాలి. మోదీని హీరోని చేసింది ఎవరు?
పౌరసమాజంలో భావజాల ఆధిపత్యం లేదా ప్రాబల్యం నిర్వహించే పాత్రపై గ్రాంసీ తన హెజమనీ సిద్ధాంతంలో విపులంగా చర్చించారు. పాలకవర్గాలు తమ పాలన సాగించడానికి బలప్రయోగ పద్ధతులతోపాటు పౌరసమాజ సమ్మతిని పొందడం కూడా సాధనం చేసుకుంటారు. ఈ పౌర సమాజ సమ్మతికి ప్రభుత్వేతర పౌర సంస్థలన్నింటి ద్వారా అంటే పాఠశాలలు, మత సంస్థలు, సాంస్కతిక సంస్థలు వగైరాలన్నింటినీ వినియోగించుకుంటారు. ఈ భావజాల ప్రాబల్యాన్ని సాధించడంలో సవర్గమేధావుల పాత్రను ఆయన వివరించారు. ఇది పాలక వర్గాల హెజమనీ సాధనలోనూ, దానికి ప్రత్యామ్నాయంగా రూపొందే కౌంటర్‌ హెజమనీ సాధనలోనూ కీలకపాత్ర పోషిస్తుంది. ఈ విశ్లేషణ నేపథ్యంలో మోదీని హీరోని చేసిన అంశాలను పరిశీలించడం అవసరం. 2017లో అమెరికాకు చెందిన అసోసియేషన్‌ ఫర్‌ పబ్లిక్‌ ఒపీనియన్‌ సంస్థ భారత ప్రజల రాజకీయ అభిప్రాయాల మీద సర్వే నిర్వహించింది. దేశంలో ఎలాంటి మినహాయింపులు లేని ప్రజాస్వామ్య ప్రభుత్వమే వుండాలన్న స్పష్టమైన నిబద్ధతను ప్రకటించిన వారు కేవలం 8 శాతం వున్నారు. 67 శాతం మంది ప్రజాస్వామ్యంపై కొంత విశ్వాసం ప్రకటించినప్పటికీ వారు ప్రజాస్వామ్య రహిత ప్రభుత్వాలపై కూడా సానుకూలతను వ్యక్తం చేశారు. 55 శాతం మంది నిరంకుశ ప్రభుత్వాలను సమర్థించారు. 27శాతం మంది ”బలమైన నాయకుడు” అవసరమన్నారు. అంతేకాదు 53 శాతం మంది సైనిక పాలన అవసరంగా భావించారు. భారతదేశానికి పాకిస్థాన్‌ ”అత్యంత” ప్రమాదకరమైన దేశంగా భావించారు. ఈ సర్వే 2017లో నిర్వహించినా ఇలాంటి భావాలు చాలకాలంగా దేశంలో వ్యక్తం అవుతూనే వున్నాయి. దీనికి తోడు బీజేపీ మాతసంస్థ రాష్ట్రీయ స్వయక్‌ సేవక్‌ సంఫ్‌ు 95 ఏళ్లుగా చరిత్రనీ, సంస్కతిని వక్రీకరిస్తూ మతవిద్వేష భావజాలాన్ని, గత కాలపు హిందూ వైభవాలనీ, మతజాతీయవాదాలు వగైరాలను నూరిపోస్తూనే వుంది. పైగా మన చరిత్ర రచన నేటికీ హీరోల చుట్టూనే తిరుగుతున్నది, పురాణాలనే చరిత్రగా భావించడం, దుష్ట శిక్షణకు యుగ పురుషుల అవతారాలపై ప్రచారం నేటికీ నడుస్తూనే వుంది.
రాజకీయరంగంలో ”నాయకత్వ సంక్షోభం” తలెత్తినప్పుడు, హీరోల కోసం వెదుకులాటలు ప్రారంభమైనప్పుడు పౌరసమాజంలోని ఇలాంటి భావజాలం కీలకపాత్ర పోషిస్తుంది. మన పౌర సమాజంలో నెలకొనివున్న ఈ భావజాలానికి తగిన ప్రతినిధిగా మోదీ కనిపించారు. ఆయనను ఈ భావజాలమే హీరోని చేసింది. దేశాన్ని ఐక్యపరిచిన వ్యక్తిగా ప్రాచుర్యంలో వున్న ”సర్దార్‌ పటేల్‌”కు నివాళిగా ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహ నిర్మాణాన్ని మోదీ ప్రకటించారు. ప్రజలు మోదీలోని ”ఉక్కుమనిషి”ని అందులో చూశారు. గుజరాత్‌ అభివద్ధి నమూనా ప్రచారంతో ”మోదీ వికాస్‌ పురుష్‌” అయ్యాడు. గుజరాత్‌ అల్లర్లలో ముస్లింలను ”ఉక్కు పాదంతో” అణిచివేసిన తీరుతో ”ప్రతీకారేచ్ఛకు” ప్రతిరూపం అయ్యాడు. భార్యను విడనాడి భరతమాత సేవకు అంకితమైన ”సర్వసంగ పరిత్యాగి” ”భారత్‌మాతాకి జై” అంటూ దేశం కోసమే జీవిస్తున్న హీరోగా కనిపించాడు. మొత్తంమీద పౌరసమాజంలో నెలకొని వున్న ఈ భావజాలం కోరుకున్నది ”దేశరక్షకుడైన ఉక్కుమనిషిని”, దేశానికి ”ప్రమాదకారి” అయిన ముస్లిం పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెప్పగల హిందూజాతీయవాదిని, గతకాలపు ”పురాణ” వైభవాలను పునరుద్ధరించే హీరోనే. మోదీ విజయం తర్వాత ప్రజలు ఆయన పాలనను ఈ భావజాలపు కళ్లద్దాలతోనే చూస్తున్నారు. నిత్య జీవితానికి సంబంధించిన మోదీ వైఫల్యాలు వారికి అంతగా పట్టకపోవడానికి ఇదే కారణం.
ప్రజా సమస్యలకు దూరం – జనాకర్షణకు మార్గం
మోదీ ఒక సాధారణ రాజకీయవాదిగా వ్యవహరించడం లేదు. ప్రభుత్వ పాలన తనకు సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారు. ఆయన ప్రసంగాలలో ప్రజలు నిత్యజీవితంలో పడుతున్న కష్టాలను ప్రస్తావించడం లేదు. వాటిని మంత్రులకు, ప్రభుత్వ యంత్రాంగానికి వదిలేశారు. వాటివల్ల వచ్చే అసంతప్తికి తాను గురికాకుండా జాగ్రత్తపడుతున్నారు. తాను హిందూ జాతీయవాదినని ప్రకటించుకున్నారు. తానొక సన్యాసిగా, యోగా సాధకునిగా, సంసార జంఝాటం లేనివాడిగా, భౌతిక వస్తువుల సంపదపై ఆసక్తి లేని వానిగా అందరి దష్టినీ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన భారతదేశాన్ని కేవలం రాజకీయవేత్తగా కాకుండా సామాజికంగా, నైతికంగా, ఆధ్యాత్మికంగా నడిపించే నేతగా కనిపించే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన తపస్సు గురించి, యజ్ఞం గురించి, యోగా గురించి, గతకాలపు హిందూ వైభవం గురించి అనేక ప్రస్తావనలు చేస్తున్నారు. కష్టాలు పడకుండా సుఖాలు, ముక్తి దక్కదన్న భావన కల్పిస్తున్నాడు. ఈ మార్గంలో ఆయన రాజకీయ అభిమానులని కాకుండా భక్తులను సష్టించుకుంటున్నాడు. భక్తులకు వచ్చే కష్టాలు దేవుడు పెట్టే పరీక్షలు… వారు కష్టాలను అనుభవిస్తారే తప్ప తమ ఆరాధనని వదులుకోరు పైగా మరింత పెంచుకుంటారు. దేశానికి మోదీ అవసరం అన్న నినాదం దీని నుండి పుట్టుకొచ్చిందే. ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే నాయకుడు అన్న నినాదం అంతిమంగా దేశంలో ప్రజాస్వామ్యాన్ని అంతం చేస్తుంది. వైవిధ్యాన్ని తొలగిస్తుంది. నియంతత్వానికి, ఫాసిజానికి ద్వారాలను తెరుస్తుంది.
అందువల్ల మోదీ రాజకీయాన్ని మరింత లోతుగా అధ్యయనం చెయ్యాలి. మోదీ పాలనాపరంగా బలహీనుడే, ప్రజల మీద భారాలు మోదే సాధారణ రాజకీయవేత్తే, కార్పొరేట్‌ దోపిడీకి ద్వారాలు తెరిచేవాడే. ఆయన ప్రజాకర్షణ ఆయన అనుసరిస్తున్న రాజకీయ విధానాలలో లేదు. పౌరసమాజంలో నెలకొన్న భావజాలంలో వుంది. దానిని తన ఆకర్షణగా మార్చుకునే పరిభాషలో వుంది. అందువల్ల మోదీ రాజకీయం మీద చేసే పోరాటం కేవలం ఆర్థిక అంశాల మీద చేస్తే సరిపోదు. మోదీ రాజకీయం మీద పోరు పౌర సమాజంలో నెలకొన్న భావజాలం మీద జరగాలి. ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కతిక రంగాలన్నింటా జరగాలి. ఇందులో సాంస్కతిక రంగంలో జరిగే పోరాటం కీలకం అవుతుంది. ప్రజల లోకజ్ఞానంలో భాగమైన ఈ భావజాలాన్ని విచక్షణా జ్ఞానంగా మార్చే కొత్త రూపంలో, సరికొత్త నినాదాలతో జరగాలి. పౌర సమాజంలో అలాంటి ప్రజాప్రత్యామ్నాయ భావజాలం మీద సాగించే ఉద్యమాల రూప కల్పనకు గ్రాంసీ భావజాలం మనకు దారి చూపిస్తుంది.
డి.వి.వి.ఎస్‌.వర్మ - 8th April 2021