మోదీని ప్రతిఘటించే ప్రత్యామ్నాయ రాజకీయం రూపొందాలి

ఇటీవల 5 రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగాయి. ఫలితాలపై పత్రికలలో విశ్లేషణల పరంపర సాగుతున్నది. ''మోదీ, అమిత్ షా ద్వయానికి శృంగభంగం'' ''బి.జె.పి. కి చావుదెబ్బ'' ''మోదీపై తొలగుతున్న భ్రమలు'' ''అపసవ్య విధానాలతో బి.జె.పి ఓటమి'' ''బెంగాల్‌ బాటలో భారత్‌ నడుస్తుందా'' వంటి శీర్షికలతో వ్యాసాలు వెలువడ్డాయి. వీటన్నింటీలోనూ స్వీయ మానసికత పాలు హెచ్చుగానూ, వాస్తవాల పరిశీలన తక్కువగానూ కనిపిస్తుంది. మోదీ పతననానికి నాందిగా ఈ ఫలితాలను చూపించే తాపత్రయంలో గణంకాల విశ్లేషణ పెడదారులు పట్టింది.
ఈ 5 రాష్ట్రాల ఎన్నికలలో బి.జె.పి విస్తరించిందా? లేక నష్టపోయిందా? అస్సాంలో బి.జె.పి తన అధికారాన్ని నిలబెట్టుకుంది. బి జె పి కి గతంలోలాగే 60 స్థానాలే వచ్చినా 3 శాతం ఓట్లు అదనంగా పొందింది. పాండిచ్చేరిలో బి.జె.పి కి గతంలో ఒక స్థానం కూడా లేదు. ఈ సారి 6 స్థానాలు గెల్చుకుంది. సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా అధికారంలో కీలక పాత్రధారి అయింది. తమిళనాడులో గతంలో దానికి ఒక్క స్థానం లేదు. అన్నాడియంకె. ఈ ఎన్నికల్లో ఓడినా బి.జె.పి. దానితో పొత్తు పెట్టుకుని 4 స్థానాలు గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టింది. కేరళలో గతంలో వున్న ఒక్క స్థానాన్ని కోల్పోయినా తన ఓట్ల శాతం యధాతథంగా నిలుపుకుంది.
ఇక దేశంలో ఎంతో ఉత్కంఠ రేపిన బెంగాల్‌ ఎన్నికలలో గతంలో దానికి వున్న 3 శాసన సభా స్థానాలను 77 కు పెంచుకుంది. కాంగ్రెస్‌ - వామపక్ష కూటమికి గల ప్రతిపక్ష స్థానాన్ని అది ఆక్రమించింది . పోతే గత పార్లమెంట్‌ ఎన్నికలలో బి.జె.పి పొందిన స్థానాలకు తగినట్లుగా ఈ ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాలు రానందున బి.జె.పి ఓటమి పాలైందని భావించలేం. ఒక రాష్ట్రంలో జరిగిన జాతీయస్థాయి ఎన్నికలలో జాతీయ పార్టీకి, ప్రాంతీయ పార్టీకి మధ్య జరిగే సంఘర్షణలో జాతీయ పార్టీకి మొగ్గు కనిపించడం సహజం. ఆనాడు కొందరి నోట వినిపించిన ''ఇక్కడ దీదీ - అక్కడ మోదీ'' అన్న మాటను విస్మరించకూడదు. ఇప్పుడు రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో ''ఇక్కడ దీదీ'' అన్నది ప్రధానం కావడం కూడా సహజం. ఇంతకీ బి.జె.పి కి గత పార్లమెంటు ఎన్నికలలో వచ్చిన ఓట్ల శాతంలో తగ్గింది కేవలం 2 శాతం మాత్రమే. ఇలాంటి వాదనల తో బి.జె.పి. కి గతంలో వున్న 3 శాసన సభా స్థానాలు 77 కు పెరిగిన వాస్తవాన్ని చూడ నిరాకరించడం సముచితం కాదు.
మొత్తంమీద ఈ 5 రాష్ట్రాల ఎన్నికలలో తన స్థానాలను నిలబెట్టుకున్నదీ, పెంచుకున్నదీ బి.జె.పి అన్న వాస్తవాన్ని వదిలేసి ఈ ఎన్నికలు దాని పరాజయంగా, చావు దెబ్బగా చిత్రించడం వాస్తవాలని చూడ నిరాకరించడమే అవుతుంది.
వామపక్షాలు కేరళలో తమ స్థితిని పెంచుకున్నాయి. దీనికి భిన్నంగా బెంగాల్‌ అవి తీవ్రమైన పరాజయాన్ని పొందాయి. కాంగ్రెస్‌ పార్టీ పాండిచ్చేరిలో అధికారాన్ని కోల్పోయింది. తమిళనాడులో డి.యం.కె. కూటమి భాగంగా కొన్ని సీట్లు పొందడం మినహా దాని స్థితి అన్ని చోట్లా అంతంత మాత్రం గానే వుంది.
దేశవ్యాపితంగా ఉత్కంఠరేపిన బెంగాల్‌ ఎన్నికలను, దాని భవిష్యత్‌ పరిణామాలను ప్రత్యేకంగా విశ్లేషించుకోవాలి.
ఈ సారి ఇక్కడ జరిగిన ఎన్నికలకు కొన్ని ప్రత్యేకతలు వున్నాయి. గతంలో ఇక్కడ ఎన్నికలు తృణమూల్‌ కాంగ్రెస్‌కీ వామపక్షాల మధ్య లేదా అంతకు ముందు వామపక్షాలకీ, కాంగ్రెస్‌కీ మధ్య జరిగిన ఎన్నికలన్నీ ఆయా పార్టీల పరిపాలన మీద, వాటి రాజకీయ, ఆర్థిక విధానాల మీద, వాటి పెత్తందారీ ధోరణుల మీద విమర్శలు, ప్రతివిమర్శల రూపంలో జరిగాయి. దీనికి భిన్నంగా ప్రస్తుత ఎన్నికలలో తృణమూల్‌ కాంగ్రెస్‌కీ, బి.జె.పి కి మధ్య జరిగిన ఎన్నికల పోరులో అలాంటి రాజకీయ విధానపరమైన సంఘర్షణ తెరవెనకకు పోయింది.
తృణమూల్‌ రాష్ట్రంలో 10 సంవత్సరాలుగా అధికారంలో వుంది. బి.జె.పి. కేంద్రంలో 7 సంవత్సరాలుగా అధికారంలో వుంది. ఈ రెండు అధికార పార్టీలు కావడంతో రెండింటి పట్ల ప్రజల్లో వ్యతిరేకత, అసంతృప్తి వున్నమాట అందరూ అంగీకరిస్తున్నారు.
బి.జె.పి పాలనలో పెద్ద నోట్ల రద్దు దగ్గర నుండి, కోవిడ్‌కాలంలో వలసకూలీల వెతలు, పేదల కడగండ్లుతోపాటు ఇటీవల కార్మికహక్కులను హరించే చట్టాలు, వ్యవసాయాన్ని కార్పొరేట్ల హస్తగతం చేసే వ్యవసాయ బిల్లులు, ప్రభుత్వ రంగ పరిశ్రమల విక్రయాలు, అంతకుమించి రోజువారీ అవసరాలైన పెట్రోలు ధరలు, గ్యాస్‌ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతం కావడం వగైరాలు వివిధ వర్గాల ప్రజలలో అసంతృప్తికి కారణాలుగా వున్నాయి. అందుకే బి.జె.పి. తన “అచ్చేదిన్ ” గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఎన్నికల్లో విధానపరంగా జరగాల్సిన చర్చను మోదీ , అమిత్ షా ద్వయం మరో దారి పట్టించారు. బెంగాల్‌ను తమ వశం చేసుకోవడం కోసం అక్కడ 8 విడతలుగా ఎన్నికలను జరిపించారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ నుండి వలసలను ప్రోత్సహించి దానిని బలహీనపర్చే కుట్రలు సాగించారు. తృణమూల్‌ను అవినీతి పార్టీగా చూపించడానికి, దాని నేతలను బెదిరించడానికి కేంద్ర సంస్థలను వినియోగించారు.
ఆ రాష్ట్రంలో మోదీ 22 సభలు పెట్టారు. అమిత్‌షా 40కి పైగా సభలు, రోడ్‌షోలు నిర్వహించారు. బి.జె.పి కేంద్ర నాయకులు, వివిధ రాష్ట్రాల నాయకులు ప్రచారకులుగా రంగప్రవేశం చేశారు.
బెంగాల్‌ ప్రజల్ని ఆకర్షించడానికి ప్రధాని మోదీ తానే రవీంద్రనాథ్‌ ఠాగోర్‌ లా కనిపించడానికి గడ్డం పెంచారు . సుభాష్‌ చంద్రబోస్‌ను ఆవాహన చేశారు. అంతిమంగా హిందూ జాతీయ వాదాన్ని మెజారిటోరియం విధానాలను ప్రచార అస్త్రాలుగా సంధించారు. పౌరసత్వ చట్టాలను అమలు చేస్తామంటూ ముస్లిం మీద, బంగ్లాదేశ్‌ వలస జీవుల మీద విరుచుకుపడ్డారు.హిందూ ఓటర్లను ఆకట్టుకోడానికి ప్రతి సభలోనూ, జై శ్రీరాం నినాదాలతో హోరెత్తించారు. ఎన్నికల్లో జరగాల్సిన రాజకీయ చర్చను మత జాతీయవాదం చర్చగా సాంస్కృతిక వారసత్వం, గత వైభవాలను తిరిగి తెచ్చే చర్చగా మార్చారు. ఇది బి.జె.పి. పాలనావైఫల్యాలను కప్పి పుచ్చుకోడానికి ప్రజల్ని ఒకే దేశం ఒకే మతం పేరుతో భావోద్రేకాల చర్చకు తెర తీశారు.
తృణమూల్‌ కాంగ్రెస్‌ ఇది కలిసి వచ్చిన అవకాశం అయింది. తన పాలనలో పెరిగిన అసంతృప్తిని ఆమె కూడా తప్పించుకోవాల్సి వుంది. అందుకే ఆమె బి.జె.పి పై పోరును తన పాలనా విజయాలతో ఎదుర్కొనే ప్రయత్న చెయ్యలేదు. ఆమె బి.జె.పి ని హిందీపార్టీగా, బెంగాల్‌పై గుజరాతీయుల దాడిగా అభివర్ణించింది. తన సభలలో జై శ్రీరాం కు బదులుగా జై బంగ్లా నినాదాలను చేయించింది. తన పాలనా వైఫలాల్య మీద, తుఫాను నిధుల అవినీతి, వివిధ పధకాలలో జరిగిన అవినీతి మీద భాషా, ప్రాంతీయ ముసుగు కప్పి బి.జె.పి మీద ఎదురు దాడి చేసింది.
బి.జె.పి అతిహిందూత్వ ప్రచారం అంతకుముందు కాంగ్రెస్‌, వామపక్షాలకు మద్దతుదారులుగా వున్న ముస్లింలను తృణమూల్‌ పక్కకు చేర్చింది. మమతను ఒంటరి చేసి ఒక్క మహిళ మీద ప్రధాని, హోంమంత్రి సాగిస్తున్న కక్షపూరిత దాడి ఆమె పట్ల సానుభూతిగా మారింది. పైగా మహిళలకు నేరుగా నగదు బదిలీ చేసే మమత పపథకాలు దీనికి తోడయ్యాయి. ఆమెకు ఘన విజయాన్ని తెచ్చిపెట్టాయి.
మొత్తం మీద ఈ ఎన్నికలలో రాజకీయ పరమైన విధాన చర్చ లేకుండా పోయింది . బి.జె.పి మత జాతీయవాదాన్ని సాధనంగా చేసుకుంటే ,మమత దానికి ప్రతిగా ప్రాంతీయ భాషావాదాన్ని సాధనం చేసుకుంది. ఇలాంటి సందర్భంలో జాతీయ పార్టీకంటే ప్రాంతీయపార్టీకి మొగ్గురావడం సహజం.
మమత, స్టాలిన్‌, విజయన్‌లు సాధించిన విజయాలు దేశంలో బి.జె.పి కి వ్యతిరేకంగా ఏర్పడే సంఘటనకు బలాన్ని చేకూర్చే మాట నిజం. ఐతే దీనికి దీదీ అనుసరించి మార్గం ఫలితాలను ఇవ్వకపోగా ప్రతికూలంగా మారే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఆమె బి.జె.పి ని హిందీపార్టీగా పేర్కొంది. అలాగే హిందూ జాతీయవాదాన్ని, ప్రాంతీయ భాషా సంస్కృతి మీద దాడిగా ప్రకటించింది. ఇవి ఒక రాష్ట్రంలో ఫలితాలను ఇస్తాయి. కాని దేశంలో జరిగే ఎన్నికలలో ఇలాంటి నినాదాలు హిందీ ప్రాంతంలో బి.జె.పిని స్థిరపరుస్తాయి. ఒకే దేశం, ఒకే ప్రజ అన్న నినాదం ముందు ప్రాంతీయ భాషా నినాదాలు దేశాన్ని బలహీనపర్చేవిగా తేలిపోయే ప్రమాదం వుంది.
అందుచేత మోదీని, బి.జె.పిని ఓడించడానికి నిర్దిష్టమైన ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి. అది బి.జె.పి మత జాతీయవాదానికి భిన్నంగా, దాని ఆర్థిక, రాజకీయ విధానాలకు భిన్నంగా ఒక కొత్త దారి చూపించేది కావాలి . ఎందుకంటే పాత రాజకీయ పద్ధతులతో బి.జె.పిని ఓడించడం సాధ్యం పడదు.అది సంప్రదాయ రాజకీయానికి భిన్నమైంది . దానిని ప్రతిఘటించగల కొత్త రాజకీయం కావాలి .
బి.జె.పి హిందూత్వ జాతీయ వాదాన్ని ప్రతిఘటించగల “భారత జాతీయ వాదాన్ని “నిర్వచించాలి. ప్రజల్ని విభజించడానికి బదులు వారిని ఐక్య పరిచేది, ప్రాంతీయ పరమైన, భాషాపరమైన మత పరమైన బహుళత్వాన్ని ఇముడ్చుకోగలిగే భారతజాతీయవాదాన్ని ముందుకు తేవాలి.
ప్రజాస్వామ్యానికి పౌరులు ప్రాతిపదిక. వారి మత విశ్వాసాలు కాదు. ఇక్కడ పుట్టిన వారికి ,నివసిస్తున్న అందరికీ పౌరసత్వం పొందేలా చట్టాలను మార్చే ప్రత్యామ్నాయాన్ని ప్రకటించాలి.
విద్యా బోధనలో చరిత్రకీ , సంస్కృతికి కృత్రిమమైన మతప్రాతిపదికకు బదులుగా దాని బహుళత్వ పునాదిని ప్రకటించే ప్రత్యామ్నాయం రూపొందాలి. ఆర్థిక రంగంలో కార్పొరేటీకరణను అదుపు చెయ్యడం వాటిని నిరోధించడం లక్ష్యంగా ప్రత్యామ్నాయ విధానాలు వుండాలి. వ్యవసాయ బిల్లులు, కార్మిక చట్టాల మార్పులు, పౌరహక్కులపై దాడికి ప్రతిగా ప్రత్యామ్నాయ విధానాలు వుండాలి.
ప్రభుత్వరంగం పటిష్టతకు , ఉపాధివిస్తరణకు తగిన ప్రత్యామ్నాయ విధానం ప్రకటించాలి.
పేదలు, ఉపశ్రేణులకు నివాసం, చదువు, వైద్యం, ఉపాధి, కనీస ఆదాయం, హక్కుగా ప్రకటించాలి. దీనిని సాధించడానికి కొద్దిమంది చేతులలో పోగుపడిన సంపదను పునఃపంపిణీ చేసే చర్యలు ప్రకటించాలి. ఇవి కొన్ని మాత్రమే ఇలాంటి ప్రత్యమ్నాయ రాజకీయం ప్రాతిపదికగా ఏర్పడే కూటములు మాత్రమే అన్ని తరగతుల ప్రజల విశ్వాన్ని చూరగొంటాయి. హిందూత్వ మతోన్మాద నినాదాల నిజస్వరూపాన్ని బహిర్గతం చేస్తాయి. అలాంటి ప్రత్యామ్నాయ రాజకీయమే మోదీని, బి.జె.పి ని ప్రతిఘటించ గలుగుతుంది.
డి.వి.వి.ఎస్‌.వర్మ - 22nd May 2021